విషాదం.. డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

దసరా మామూళ్ల పేరుతో వేధింపులు.. సూసైడ్ నోట్లో పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం

 

భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఆత్మహత్య . తనను గత కొన్ని నెలలుగా దసరా మామూళ్ల పేరుతో కార్యాలయ సిబ్బంది, పలువురు మీడియా ప్రతినిధులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు సమాచారం.

 

సూసైడ్ నోట్లో సంచలన ఆరోపణలు

 

అందిన సమాచారం ప్రకారం.. డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీనారాయణను దసరా మామూళ్లు ఇవ్వాలని కొందరు ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోతే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు ఆయన సూసైడ్ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొంతమంది తనను రూ.కోటి ఇవ్వాలని తీవ్రంగా వేధించినట్లు కూడా ఆ నోట్లో రాసినట్లు సమాచారం.

 

ఈ పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. అనంతరం తనను వేధించినట్లు ఆరోపించిన వారి పేర్లను సూసైడ్ నోట్లో రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

పోలీసుల దర్యాప్తు

చాలాసేపటి వరకు గది నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చింది. కిటికీలోంచి చూడగా లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

 

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకుని, అందులో పేర్కొన్న పేర్లు, వేధింపుల ఆరోపణలు, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

 

దసరా పండుగ వేళ ఓ ప్రభుత్వ అధికారి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సూసైడ్ నోట్లో చేసిన ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram