ఎన్నికలను బహిష్కరించినట్లు ప్రకటించిన పశ్చిమ ఇబ్రహీంపట్నం ముస్లిం మైనార్టీలు
సమస్యను తీవ్రతరం చేయొద్దు – మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దు
తక్షణమే కలెక్టర్ స్పందించాలని విజ్ఞప్తి
నిరసనగా మసీదు వద్ద రోడ్డుపై బైఠాయింపు
ఇబ్రహీంపట్నం : కొండపల్లి మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు పశ్చిమ ఇబ్రహీంపట్నం ముస్లిం మైనార్టీలు. దశాబ్దాలుగా అందరికీ ఉపయోగించే స్థలాన్ని కొందరు మాత్రమే కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేశారని ఆరోపించారు. పూర్తిగా గేట్లు పెట్టి తాళం వేసి కబ్జా చేయడం సరికాదని వెంటనే స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అందరికీ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నోసార్లు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తక్షణమే స్పష్టమైన హామీ లభించే వరకు నిరసన విరమించబోమని మసీదు వద్ద రోడ్డుపై బైఠాయించారు. తమకు న్యాయం జరగకపోతే మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.








