మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోలేటి భవాని శంకర్
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం, అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం వద్ద గోదావరిపై ఉన్న ఆనకట్ట నుండి మూడు జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందిస్తున్నారు.ఆ ఆనకట్టపై ఒక మీటరు ఎత్తులో ఇసుక బస్తాలు వేసి, ఒక టీఎంసీ నీరు నిల్వ ఉండే విధంగా రూపకల్పన చేసి, ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసి విన్నవించి ఆమోదం పొంది, తదుపరి ఆనకట్టను సందర్శించి అధికారులకు ఆదేశాలు చేసి, భవిష్యత్తులో సాగునీటికి ఇబ్బంది లేకుండా ముందుచూపుతో ఆలోచించిన అభివృద్ధి ప్రదాత, మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, తుమ్మల వీరాభిమాని కోలేటి భవాని శంకర్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా కోలేటి భవాని శంకర్ మాట్లాడుతూ, గతంలో వేసవికాలంలో గోదావరిలో నీటి మట్టం తగ్గి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడేవని, ఎల్నీనో ప్రభావాన్ని ఎదుర్కొనే విధంగా మంత్రి తుమ్మల గారు ఈ వినూత్న ఆలోచన చేశారని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఈ నిర్ణయం కీలకంగా మారనుందన్నారు.తాగునీటి అవసరాలతో పాటు, రైతుల సాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం, తుమ్మల గారి అనుభవానికి, ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. మూడు జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చడంతో పాటు, భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించిన ఘనత మంత్రి తుమ్మల గారికే దక్కుతుందని, ఇది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని అన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని, పినపాక నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కోలేటి భవాని శంకర్ పేర్కొన్నారు.









