తన నామినేషన్ అడ్డుకునేందుకే నా భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపణ
గోల్డెన్ న్యూస్ / నల్లగొండ / బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్‌కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది.
అభ్యర్థి మామిడి లక్ష్మి తెలిపిన వివరాల మేరకు నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివారం ఉదయం బయటకు వెళ్లిన తన భర్త యాదగిరి తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె స్థానిక నేతలతో కలిసి నల్లగొండలో పార్టీ దీక్షా దివస్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి తన భర్త కిడ్నాప్ అయిన విషయాన్ని వివరించింది. వెంటనే కంచర్ల భూపాల్‌రెడ్డి.. మామిడి లక్ష్మితోపాటు నేరుగా గ్రామానికి చేరుకున్నారు. స్థానిక నాయకుల సాయంతో లక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా, పలువురు వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు ఏకగ్రీవం కోసం ఇతరులెవ్వరూ నామినేషన్ వేయకుండా బెదిరిస్తున్నట్టు బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. ఇందులో భాగంగానే తన భర్త యాదగిరితోపాటు వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలకు కూడా బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. అయితే పోలీసులకు సమాచారమిఇచ్చినా శనివారం రాత్రి వరకు యాదగిరి ఆచూకీ లభించలేదు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.









