గోల్డెన్ న్యూస్ //మణుగూరు// కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని పినపాక సభ్యులు పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి, ప్రతి ప్రజాప్రతినిధికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇతర నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అత్యంత దురదృష్టకరమని, ప్రజల గొంతును అణిచివేసే చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచివి కావని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.
ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ, విభిన్న అభిప్రాయాలను గౌరవించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలని ఆయన కోరారు. రాజకీయ విభేదాలను అణచివేతతో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎదుర్కోవాలని సూచించారు.
రాహుల్ గాంధీతో పాటు నిరసనలో పాల్గొన్న నాయకులను తక్షణమే విడుదల చేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









