మూత్రశాలలు ఉన్నా లేనట్టే.
సంవత్సర కలం నుండి వినియోగంలో లేని మూత్రశాలలు.
ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని పేరెంట్స్ డిమాండ్.
గోల్డెన్ న్యూస్ //పినపాక// మండల పరిధిలోని పెంటన్నగూడెం గ్రామంలోనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లోని విద్యార్థులకు మూత్రశాలలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒంటికి వచ్చిన రెంటుకొచ్చిన బయటికి వెళ్లాల్సిందేనని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మూత్రశాలలు కేవలం కాగితాలకే పరిమితమై,వాడుకలోకి రాకపోవడం గమనార్హం. 2024 లో అప్పటి కలెక్టర్ ప్రియాంక అలా చొరవతో ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కమిటీ ద్వారా, MGNREGS (ఉపాధి హామీ పథకం) కింద రూ. 3.5 లక్షల వ్యయంతో బాలురు మరియు బాలికల కోసం ప్రత్యేక మరుగుదొడ్లను మంజూరు చేశారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులను కాంట్రాక్టర్ శంకర్ పూర్తి చేశారు. అయితే, నిర్మాణం పూర్తయి మూడేళ్లు గడుస్తున్నా.. సదరు బిల్లులు ఆన్లైన్ కావడం లేదనే సాకుతో అధికారులు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్‌ను తిప్పుతున్నట్లు సమాచారం. దీంతో సదరు టాయిలెట్లకు తాళాలు వేసి ఉంచడంతో అవి వాడుకలోకి రాలేదు.చుట్టూ పొలాలు.. పాముల భయం!పాఠశాల చుట్టూ పొలాలు, చెట్లు దట్టంగా పెరిగిపోయాయి. మూత్రశాలలు అందుబాటులో లేకపోవడంతో చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఆ ప్రాంతంలో పాములు మరియు ఇతర విషకీటకాల సంచారం ఎక్కువగా ఉండటంతో విద్యార్థులు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. అటు మూత్రశాలలు వాడుకునే పరిస్థితి లేక, ఇటు బయటకు వెళ్లే ధైర్యం లేక చిన్నారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకోరావాలని తల్లిదండ్రులు కోరుతున్నారు..
టాయిలెట్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నాయి కానీ అవి వినియోగంలోకి రాలేదు. సదరు కాంట్రాక్టర్ మాకు అవి అప్పగించలేదు. టాయిలెట్స్ లేక విద్యార్థులు మూత్ర వసర్జనకు ఆరు బైటకి వెళ్లాల్సివస్తుంది ముఖ్యంగా అమ్మాయిలు బాగా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయం పై ఉన్నత అధికారులకు తెలియజేసి సమస్యను పరిష్కరించే విధంగా నా వంతు కృషి చేస్తాను పాఠశాల ఉపాధ్యాయులు సతీష్..










