యాచకుడికి రాఖీ కట్టిన విద్యార్థిని

⇒యాచకుడికి రాఖీ కట్టిన విద్యార్థిని.. చివరికి అతడిచ్చిన గిఫ్ట్ చూసి షాక్!

⇒రాఖీ అడిగిన బిచ్చగాడికి ఎవరూ ముందుకు రాలేదు.. ఒక్క అమ్మాయి ధైర్యం చేసి కట్టిన రాఖీ

⇒భయం.. ఆనందం.. ఆశ్చర్యం.. ఒకే దృశ్యంలో ఎన్నో భావోద్వేగాలు!

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్/ రాఖీ పౌర్ణమి సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటన ఎక్కడ జరిగిందనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ, వైరల్ అవుతున్న వీడియో మాత్రం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వైరల్ వీడియోలో ఓ వ్యక్తి చేతిలో రాఖీ పట్టుకొని రోడ్డుపై కనిపించే అమ్మాయిలను తనకు రాఖీ కట్టాలని కోరుతున్నట్లు కనిపిస్తుంది. అతడి వాలకం, దుస్తులు, ఒంటి నిండా మురికి ఉండటంతో పలువురు విద్యార్థులు అతడి వద్దకు వెళ్లేందుకు వెనుకంజ వేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.

అదే సమయంలో కాలేజీకి వెళ్తున్న విద్యార్థుల గుంపులో ఓ యువతి మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చింది. అతడి పరిస్థితిని చూసి భయపడకుండా, అతడి చేతికి రాఖీ కట్టింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఆసక్తిగా ఆ దృశ్యాన్ని గమనించారు.

 

అసలైన ట్విస్ట్ అక్కడే..

 

రాఖీ కట్టిన తర్వాత ఆ వ్యక్తి చేసిన పని అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన వద్ద ఉన్న సంచిలోంచి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ బాక్స్‌ను బయటకు తీసి, రాఖీ కట్టిన ఆ విద్యార్థినికి బహుమతిగా అందించాడు.

తాను కేవలం సోదర భావంతో రాఖీ కట్టానని భావించిన ఆ యువతి.. ఊహించని విధంగా ఖరీదైన మొబైల్ ఫోన్ బహుమతిగా అందుకోవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైనట్లు వీడియోలో కనిపిస్తోంది. చుట్టూ ఉన్న విద్యార్థులు సైతం ఈ ఘటనను చూసి అవాక్కయ్యారు.

మొదట భయాన్ని కలిగించిన వ్యక్తి.. చివరకు ఓ చెల్లెలి ప్రేమకు విలువనిచ్చి బహుమతి అందించడం ఈ వీడియోలోని ప్రధాన ఆకర్షణగా మారింది. దీంతో వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

అయితే ఈ వీడియో నిజంగా జరిగిన సంఘటనా? లేక ముందుగా రూపొందించిన కాన్సెప్ట్ వీడియో రీలా? అనే విషయం స్పష్టంగా తెలియదు. వీడియోకు సంబంధించిన ప్రదేశం, వ్యక్తుల వివరాలు కూడా అధికారికంగా వెల్లడికాలేదు.

ఏది ఏమైనప్పటికీ.. రాఖీ అంటే కేవలం రక్తసంబంధం కాదు.. ఆప్యాయత, నమ్మకం, సోదర భావానికి ప్రతీక అనే సందేశాన్ని ఈ వైరల్ దృశ్యం గుర్తుచేస్తోందంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram