పూర్వీకుల ఆచారంగా పొట్టగండుగ–పచ్చ పండుగ

రఘునాథపాలెంలో పూర్వీకుల ఆచారంగా పొట్టగండుగ–పచ్చ పండుగ(కొత్తలు)

 

 

కరకగూడెం : రఘునాథపాలెంలో పూర్వకాలం నుంచి వస్తున్న పోలేబోయిన వంశం, పులి వంశస్థుల సంప్రదాయ ఆచారంగా (పొట్టగండుగ–పచ్చ పండుగ) ను ఆదివారం ఈరోజు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

 

కొత్త వరి, సామా, దుస్సా కంకులు తదితర పంటలు పచ్చగా పొట్ట దశలో ఉన్న సమయంలో వాటిని ప్రకృతి, భూమి, వేల్పుతో అనుసంధానం చేస్తూ కృతజ్ఞతగా ఈ ఆచారాన్ని నిర్వహించడం పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయంగా స్థానికులు తెలిపారు.

 

ప్రాంతాన్ని బట్టి ఈ ఆచారాన్ని “పొట్టగండుగ”, “పచ్చ పండుగ”, “కొత్తలు”, “వేల్పుకు వెన్నుకట్టు” వంటి పేర్లతో పిలుస్తారని, పేర్లు మారినా కొత్త పంటను గౌరవించడం, ప్రకృతికి కృతజ్ఞత తెలియజేయడం, వేల్పుతో తమ జీవన సంబంధాన్ని కొనసాగించడం ఈ ఆచారం వెనుక ఉన్న ప్రధాన భావమని తెలిపారు.

 

ఈ సందర్భంగా పోలేబోయిన, పులి వంశస్థులు  సంప్రదాయ పద్ధతుల్లో పాల్గొని పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించారు. వంశపారంపర్యంగా వస్తున్న ఇటువంటి ఆచారాలు కేవలం పండుగలు మాత్రమే కాకుండా ఆదివాసీ సమాజ చరిత్ర, వంశ గుర్తింపు, వ్యవసాయ జ్ఞానం, ప్రకృతి ఆరాధన, సామూహిక జీవన విధానానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

 

ప్రస్తుత తరానికి ఈ ఆచారాల ప్రాధాన్యతను తెలియజేయడంతో పాటు, పెద్దల వద్ద ఉన్న *వంశ చరిత్ర, వేల్పు సంప్రదాయాలు, పూజా విధానాలు, పంటలకు సంబంధించిన జ్ఞానం, మౌఖిక చరిత్రను నమోదు చేసి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని వారు సూచించారు.

 

పూర్వీకులు అందించిన ఆచారం మన వారసత్వం; దానిని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు.

 

వంశం – వేల్పు – పంట – ప్రకృతి

 

ఈ నాలుగు బంధాల సమ్మేళనమే ఆదివాసీ జీవన సంస్కృతి అని ఈ పండుగ చాటి చెబుతోంది.

 

ఈ పండుగలో గ్రామ పెద్దలు, పూజారులు, తలపతులు, వడ్డేలు, మహిళలు, యువత, పిల్లలు, కుటుంబాలు కలిసి పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram