ములుగు : పండుగ సెలవులకు మేనమామ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు కుంటలో పడి మృతి చెందిన విషాద ఘటన తెలిసిందే. అన్నదమ్ములు వినయ్, నీటిలో జారిపడగా, అతడిని కాపాడేందుకు అన్న యత్నించి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పండుగ సంబరాల్లో ఉండాల్సిన కుటుంబాల్లో విషాదం నెలకొంది. మార్చురీలో బిడ్డల మృతదేహాలు చూసిన తల్లి బోరున విలపించి సృహ కోల్పోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) ఇద్దరు కుమారులు ఉన్నారు. వినయ్ కిశోర్ ఇంటర్, రాజేశ్ పదో తరగతి చదువుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వాతి తన ఇద్దరు కుమారులను తీసుకుని ములుగు మున్సిపాలిటీ పరిధిలోని గణేశ్‌లాల్‌పల్లిలో ఉన్న పుట్టింటికి వెళ్లారు
ఆదివారం సెలవు కావడంతో ఇద్దరు బాలురను అక్కడే ఉంచి స్వాతి తిరిగి కమలాపూర్‌కు వెళ్లారు. సాయంత్రం సమయంలో అన్నదమ్ములు తమ బంధువుల అబ్బాయితో కలిసి గ్రామ సమీపంలోని మొండికుంట వైపు వెళ్లారు. అక్కడ బహిర్భూమికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కుంటలో మొరం మట్టి కోసం తీసిన గుంతలోకి వినయ్ కిశోర్, రాజేశ్ ప్రమాదవశాత్తు జారిపడి నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనను గమనించిన మరో బాలుడు వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నీటిలో గాలింపు చేపట్టారు. అయితే అప్పటికే ఇద్దరు బాలురు మృతిచెందినట్లు గుర్తించారు.









