– బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
– దళిత బిడ్డ స్పీకర్ను అవమానించడం రాష్ట్ర ప్రజలందరినీ అవమానించడమే..
– ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకుల్లారా.. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి!
CM రేవంత్ రెడ్డి నాయకత్వంలో దళిత బిడ్డకు స్పీకర్ పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది.
— సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్.
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం/ TPCC, DCCల పిలుపు మేరకు, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గౌ. శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత బిడ్డను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడటం కేవలం స్పీకర్ను అవమానించడం మాత్రమే కాదని, రాష్ట్ర ప్రజలందరినీ అవమానించినట్లేనని అన్నారు.
అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ప్రతీక అని, రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు చేయడం వేరు.. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని వ్యక్తిగతంగా కించపరిచేలా మాట్లాడటం వేరని స్పష్టం చేశారు.దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పింది కేసీఆర్ కాదా? మాట తప్పితే తల నరుక్కుంట అన్న కేసీఆర్ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. అదే సమయంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక దళిత బిడ్డకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా అవకాశం కల్పించి సామాజిక న్యాయానికి ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు.
దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి రాజ్యాంగబద్ధమైన అత్యున్నత బాధ్యతలు అప్పగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. అలాంటి పదవిలో ఉన్న స్పీకర్ను అవమానించేలా మాట్లాడటం బీఆర్ఎస్ నాయకుల రాజకీయ సంస్కారాన్ని ప్రజలకు తెలియజేస్తోందని విమర్శించారు.
ఎమ్మెల్సీ తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఇకనైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలని.. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ పదవుల గౌరవం, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని ఘాటుగా హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ఎర్ర సురేష్, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు చౌలం కేశవరావు, సర్పంచ్ ఎర్రం పొట్టయ్య, ఉప సర్పంచ్లు పూజారి వెంకన్న, గాంధర్ల రామనాథం,మాజీ ఉప సర్పంచ్ కొమరం వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు అత్తే సారయ్య, మండల నాయకులు షేక్ రఫీ, ఎల్లబోయిన బుచ్చయ్య, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ – గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..









