వ్యక్తిపై హత్యాయత్నం

ప్రాణాపాయ స్థితిలో భీమరాజు

 

కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని అశ్వాపురంపాడు గ్రామంలో పాత కక్షల నేపథ్యంలో భీమరాజుపై కత్తులు, గొడ్డళ్లతో దాడి జరిగినట్లు సమాచారం.

 

స్థానికుల వివరాల ప్రకారం.. సుమారు మూడు నెలల క్రితం అశ్వాపురంపాడు గ్రామానికి చెందిన పెద్దమనిషి వెంకటేశ్వర్లుపై దాడి జరిగి మృతి చెందిన ఘటనకు సంబంధించిన కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఘటనకు ప్రతీకారంగా వెంకటేశ్వర్లు కుమారుడు తన ఇద్దరు, ముగ్గురు స్నేహితులతో కలిసి భీమరాజుపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

భీమరాజు శనివారం మధ్యాహ్నం ఆవులను మేపేందుకు వెళ్లిన సమయంలో, ఎవరూ లేని ప్రదేశంలో అతడిపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో భీమరాజుకు తీవ్ర గాయాలైనట్లు తెలిసింది.

 

దాడి విషయం తెలుసుకున్న భీమరాజు భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న భీమరాజును మెరుగైన వైద్యం కోసం మణుగూరుకు తరలించినట్లు సమాచారం.

 

భీమరాజుకు భార్యతో పాటు ఆరుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు తెలిసింది.

 

ఈ ఘటనపై కరకగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్‌ఐ పి.వి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తు అనంతరం వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram