విద్యార్థిపై దాడి చేసిన ఆర్టీసీ డ్రైవర్‌పై వేటు…
విధుల నుంచి తొలగిస్తూ టిజిఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం.
మహబూబాబాద్ : నెల్లికుదురు సమీపంలో పాఠశాల విద్యార్థి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, దాడికి పాల్పడిన తొర్రూరు డిపోకు చెందిన బస్సు (TS26T1266) డ్రైవర్ స్వామి (స్టాఫ్ నం. 2047)పై తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తీవ్రంగా స్పందించింది. డ్రైవర్ స్వామి ని విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో డ్రైవర్ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా ప్రవర్తించినట్లు తేలడంతో తక్షణమే ఈ చర్యలు తీసుకున్నారు.
ప్రయాణికుల భద్రత, గౌరవానికే తొలి ప్రాధాన్యం:
ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వయోవృద్ధుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన బాధ్యత ప్రతి సిబ్బందిపై ఉందని సంస్థ స్పష్టం చేసింది. బస్సుల్లో ప్రయాణించే వారి భద్రతకు, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడే వారిని ఎంతమాత్రం సహించేది లేదని ఆర్టీసీ యాజమాన్యం ఈ సందర్భంగా హెచ్చరించింది. సిబ్బంది అందరూ ప్రయాణికులతో సౌమ్యంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని యాజమాన్యం స్పష్టం చేసింది.









