⇒ భూ సమస్యల పరిష్కారానికి వేదికలుగా రెవెన్యూ సదస్సులు ..
⇒ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : రెవెన్యూ, భూమి సంబంధిత సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ సదస్సులు వేదికలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సదస్సు కు వచ్చిన అర్జీదారుల సమస్యలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిని ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా?అని అధికారులను ఆరా తీశారు. వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.స్వీకరించిన దరఖాస్తులకు రసీదులు అందించాలని,సంబంధిత రిజిస్టర్లలో వివరాలు రాయాలని ఆదేశించారు. దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్‌డెస్క్ లను,రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించి పలు సూచనలు చేశారు.సమస్యల వారీగా అర్జీలను విభజిస్తూ, పక్కాగా రికార్డులను పొందుపర్చాలని అన్నారు. తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించదగిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. జూన్ 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నామని,భూ సమస్యలున్న ప్రజలు ఈ సదస్సులకు హాజరై దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సదస్సులలో ప్రజలు సమర్పించే ప్రతి దరఖాస్తును స్వీకరించాలని, సానుకూలంగా ఉన్న సమస్యలను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. ఒకవేళ సమస్యను పరిష్కరించేందుకు నిబంధనలు అంగీకరించని పక్షంలో దరఖాస్తుదారుడికి ఆ విషయాన్ని స్పష్టంగా అర్ధమయ్యే రీతిలో తెలియజేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దరఖాస్తుదారులను పదేపదే తిప్పుకోకూడదని, సదస్సులో అర్జీలు అందించేందుకు వచ్చే వారితో సున్నితంగా వ్యవహరించాలని రెవెన్యూ బృందాలకు హితవు పలికారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి రికార్డుల ఆధారంగానే వాటిని పరిష్కరించాలని సూచించారు. ఈ రెవెన్యూ సదస్సులు ముగిసిన మీదట క్షేత్రస్థాయిలో విచారణ జరపాల్సి ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని వివరాల నమోదులో తప్పిదాలకు తావు లేకుండా చూడాలన్నారు. అర్హులైన వారికి పూర్తి న్యాయం జరిగేలా సానుకూల దృక్పథంతో పని చేయాలని, అప్పుడే భూభారతి రెవెన్యూ సదస్సుల నిర్వహణకు సార్థకత చేకూరి, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కలెక్టర్ అన్నారు.
డంపింగ్ యార్డ్ పరిశీలన.
కలెక్టర్ మిట్టగూడం గ్రామపంచాయతీ డంపింగ్ యార్డ్ నందు పంచాయతీ సిబ్బంది మరియు గ్రామస్తులకు బయోచార్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఖాళీ డ్రమ్ కింది భాగంలో గాలి ప్రవేశించేలా రంధ్రాలు చెయ్యాలన్నారు. ఈ డ్రమ్ను మూడు సిమెంట్ రింగుల మధ్య ఉంచి అడుగులో ఎండిన ఆకులు వేసి మంట పెట్టాలని అని తెలిపారు . పై భాగంలో ఎండిపోయిన, పనికిరాని మొక్కల భాగాలను వేసి డ్రమ్కు మూతపెట్టారు. రింగుల మధ్యలోను ఆకులు, పొట్టు వేసి మంటపెట్టడంతో ద్వారా తక్కువ ఆక్సిజన్లో కాలిన మొక్కలు బూడిదగా మారకముందే వాటిని చల్లార్చితే ఏర్పడిన బొగ్గును బయోచార్ అంటారని కలెక్టర్ వెల్లడించారు. దీన్ని పొడిలా చేసి పొలాల్లో వాడితే పంటల దిగుబడి పెరుగుతుందని, దీనికి పశుమూత్రం జోడించి ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని తెలిపారు. మట్టిలో జీవపదార్థం పెంపు, నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుదల,ఎరువుల అవసరం తగ్గింపు, వాతావరణ మార్పుల ప్రతికూలతను తగ్గించి నేల స్థిరంగా ఉండేలా చేయడం వంటి ఉపయోగాలు ఉంటాయని వివరించారు. ఇలా తయారు అయిన ఎరువులను రైతులకు విక్రయించడం ద్వారా అధికంగా కూడా అభివృద్ధి చందవచ్చని, ఆ దిశగా పంచాయతీ అధికారులు అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం కలెక్టర్ అదే గ్రామంలో కోర్స సోనీ అనే రైతు నిర్వహిస్తున్న కొర్రమేను చేపల పెంపకం యూనిట్ ను సందర్శించారు. ఈ యూనిట్ ను విజయవంతంగా నిర్వహిస్తున్న సోనీ మరియు ఆమె భర్త దుర్గారావును కలెక్టర్ అభినందించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మరిన్ని చేపల పెంపకం యూనిట్లు నెలకొల్పాలని, దానికి గాను రైతులకు శిక్షణ ఇవ్వడానికి సోనీ ఆమె భర్త దుర్గారావు దంపతులు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ పథకం ద్వారా ఫామ్ పౌండ్స్ త్రవ్వడానికి రైతులను ప్రోత్సహించిన సిబ్బందిని అభినందించారు.










