ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం
నీటి లభ్యత, విద్యుత్ సరఫరా సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి
మణుగూరు ; మణుగూరు మండలం చిన్న రాయిగూడెం గ్రామంలో బుధవారం ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్లో ఏర్పడే పరిస్థితులపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు పాల్గొని రైతులకు కరువు పరిస్థితులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు మాట్లాడుతూ, ఎల్ నినో ప్రభావంతో రానున్న యాసంగి సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో సాగునీటి లభ్యత తగ్గడంతో పాటు విద్యుత్ సరఫరాలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఈ పరిస్థితులను రైతులు ముందుగానే అంచనా వేసుకొని పంటల సాగుపై తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ముఖ్యంగా అధిక నీటి అవసరం ఉండే వరి పంట సాగు చేయడం వల్ల భవిష్యత్తులో నీటి కొరత కారణంగా పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అందువల్ల రానున్న యాసంగి సీజన్లో రైతులు వరి సాగుకు వెళ్లకుండా, నీటి లభ్యతను బట్టి తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు.
రైతులు నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని బాబురావు కోరారు. ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితుల్లో పంట నష్టాలను నివారించేందుకు ప్రతి రైతు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.








