రేపటి నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ విధానంలో కీలక మార్పులు..

రేపటి నుంచి (జూన్ 2) అన్ని స‌బ్‌ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్‌

 

పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ మరియు సమాచార ప్రసార శాఖ మంత్రి

 

రిజిస్ట్రేష‌న్ సేవ‌ల్లో 82476 23578 వాట్సాప్ నెంబర్ తో వాట్సప్ చాట్‌బాట్ మేధా

 

రాష్ట్రంలోని అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ (ఎఐ) సేవ‌ల‌ను ఉప‌యోగించుకొని ప్ర‌జ‌ల‌కు మ‌రింత సులువైన స‌మ‌ర్ధ‌వంత‌మైన సేవ‌లను అందించ‌బోతున్నాం.

 

రాష్ట్ర వ్యాప్తంగా 144 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు గాను ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌యోగాత్మ‌కంగా రెండు విడుత‌ల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమ‌లుచేయ‌గా తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో అమ‌లు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్దం చేయడం జరిగింది.

 

రేపటి నుండి అమలు చేయనున్న ఆదివారం నాడు స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ అధికారుల‌తో సమీక్ష నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువ‌స్తున్న నేప‌ధ్యంలో ఎలాంటి సాంకేతిక స‌మ‌స్య‌లు రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారులకు సూచించడం జరిగింది.

 

ఆస్తుల క్ర‌య విక్ర‌య‌దారుల‌కు స‌మ‌యం ఆదా అయ్యేలా పార‌ద‌ర్శ‌కంగా అవినీతి ర‌హితంగా మెరుగైన సేవ‌లు అందించేందుకు చేప‌ట్టిన స్లాట్ బుకింగ్ విధానం వ‌ల్ల అనుకున్న విధంగానే స‌త్ఫ‌లితాలు వ‌చ్చాయి. 94 శాతం ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు, మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు , రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయి. స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయి.

 

అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌లో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ ( ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ -ఎఐ) అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ – మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ నూత‌న ప్ర‌క్రియ వ‌ల్ల రిజిస్ట్రేష‌న్ చేసుకునే వారికి క‌లిగే సందేహాలు నివృత్తి అవుతాయి. అంతేగాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివ‌రాలు, స‌మ‌యం అందుబాటు వంటి స‌మాచారం ల‌భిస్తుంది. గిప్ట్ డీడ్‌, సేల్ డీడ్ పై రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు మార్కెట్ ధ‌ర‌లు త‌దిత‌ర అన్ని అంశాల‌పై ఈ ఎఐ చాట్‌బాట్ – మేధ ద్వారా స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

 

అక్ర‌మాల‌కు చెక్ పెట్టేలా లేఅవుట్‌ల‌లో డబుల్ రిజిస్ట్రేష‌న్ జ‌ర‌గ‌కుండా, రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివ‌రాలు ఇటు రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యంలో అటు బిల్డ‌ర్ లేదా డెవ‌ల‌ప‌ర్ ద‌గ్గ‌ర వివ‌రాలు ఉండేలా త్వరలో డెవ‌ల‌ప‌ర్ రిజిస్ట్రేష‌న్ మాడ్యూల్ ను తీసుకువస్తాం. ఈ మాడ్యూల్ లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయి.

 

స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌లో ప‌ని భారం అధికంగా ఉన్న ప‌ఠాన్‌చెరువు, యాద‌గిరి గుట్ట‌, గండిపేట‌, ఇబ్ర‌హీం ప‌ట్నం , సూర్యాపేట‌, జ‌డ్చ‌ర్ల ,మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌న‌ప‌ర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అద‌న‌పు స‌బ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని కూడా నియ‌మించ‌డం జరిగింది.

 

ఉద‌యం 10.30 గంట‌ల నుంచి లంచ్ స‌మ‌యాన్ని మిన‌హాయించి సాయింత్రం 5 గంట‌ల వ‌ర‌కూ స్లాట్ బుక్ చేసుకోవ‌చ్చు. ప్ర‌తి కార్యాల‌యంలో రోజుకు 48 స్లాట్‌లు బుక్ అవుతాయి. స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్య‌వ‌స‌ర సంద‌ర్భాల‌లో సాయంత్రం 5 నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కు ఐదు వాకిన్ రిజిస్ట్రేష‌న్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌డం జరుగుతుంది.

 

స్లాట్ బుకింగ్‌తోపాటు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను మ‌రింత వేగ‌వంతం చేయ‌డంలో భాగంగా ఆధార్‌-ఈ సంతకం ప్ర‌వేశ‌పెడుతున్నాం, ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌, ఖ‌మ్మం జిల్లా కూసుమంచి స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో ప్రయోగాత్మక అమలుచేస్తున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం.

 

ప్ర‌జ‌ల ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు, మ‌నోభీష్టం మేర‌కే ప్రజా ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకొని అమ‌లు చేస్తుంది. అంతిమంగా ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యం.

Facebook
WhatsApp
Twitter
Telegram