హోమ్ లోన్ మాఫీ కోసం భర్తనే హత్య చేసిన భార్య..!

హోమ్ లోన్ మాఫీ కోసం భర్తనే హత్య చేసిన భార్య..!

అక్రమ సంబంధం, ప్రియుడు–RMP డాక్టర్ సాయంతో దారుణ హత్య

పోలీసు అదుపులో  ముగ్గురు నిందితులు

 

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో సంచలన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. హోమ్ లోన్ మాఫీ పొందాలనే ఆశతో పాటు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించాలనే ఉద్దేశంతో ఓ మహిళ తన ప్రియుడు, మరో వ్యక్తి సహకారంతో భర్తనే హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

 

కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడమంచతండా శివారులో భూక్య ఈరన్న (45) అనుమానాస్పదంగా మృతి చెందాడు. తొలుత దీనిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినప్పటికీ, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది పక్కా హత్యగా తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

 

నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి:

బోడబాలోజీ, భూక్య ఈరన్న భార్య విజయ,ధర్మారపు భరత్ గ్రామీణ వైద్యుడు.

 

మహబూబాబాద్ SDPO  తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు భూక్య ఈరన్న భార్య భూక్య విజయకు మరియు అదే తండాకు చెందిన బోడబాలోజీకి కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ఈరన్న తన వ్యవసాయ భూమిని అమ్మి కొంత అప్పు తీర్చినా, ఇంకా బాకీలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోడబాలోజీ, అతని స్థలంలో కిరాయికి ఉండే RMP వైద్యుడు ధర్మారపు భరత్ సహాయంతో ముత్తూట్ సంస్థలో హౌస్ లోన్ ఇప్పించారు.

 

లోన్ తీసుకున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందితే లోన్ మాఫీ అవుతుందని తెలిసిన నిందితులు, ఈరన్నను హత్య చేసి ప్రమాదంగా చూపించాలని కుట్ర పన్నారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం 22-12-2025 రాత్రి మద్యం తాగుదామని చెప్పి ఈరన్నను తండా బయట ఉన్న తూము పామాయిల్ తోట వద్దకు పిలిచారు. అక్కడ మద్యం సేవించిన అనంతరం బోడబాలోజీ ఇనుప రాడ్డుతో ఈరన్న తల వెనుక బలంగా కొట్టగా, కిందపడిన అతడిని ధర్మారపు భరత్ టవల్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.

 

హత్య అనంతరం దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బెరువాడ వెళ్ళు రోడ్డుపక్కన తూము సాయి దినేష్ పొలంలో మృతుడిని అతని మోటార్ సైకిల్‌తో సహా పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

ఈ కేసును అత్యంత వేగంగా, 24 గంటల్లోనే ఛేదించిన కేసముద్రం సీఐ వై.సత్యనారాయణ, ఎస్సైలు కె.క్రాంతి కిరణ్, పి.నరేష్ (SI-II) మరియు వారి సిబ్బందిని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. పీ. శబరీష్ ఐపీఎస్ అభినందించారు.

 

ఈ ఘటన అక్రమ సంబంధాలు, ఆర్థిక లోభం ఎలా ప్రాణాంతక నేరాలకు దారి తీస్తాయో మరోసారి స్పష్టంగా చూపిందని పోలీసులు పేర్కొన్నారు.

Recent News :

MOHAMMED RAFEE

MOHAMMED RAFEE

GOLDEN NEWS EDITOR & CHAIRMAN

Admin

Golden News

Facebook
WhatsApp
Twitter
Telegram