ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య

నిజామాబాద్ నగర శివారులోని న్యాల్కల్లో అత్యంత కిరాతకమైన ఘటన వెలుగుచూసింది.

 

గోల్డెన్ న్యూస్/ వెబ్ డెస్క్/ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఓ భార్య తన భర్తను లో పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టింది. టాయిలెట్ క్లీనర్ వాడే హార్పిక్ లిక్విడ్ ను ఇంజెక్షన్ ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించి అత్యంత క్రూరంగా హతమార్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ భార్య సంధ్యకు, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇటీవలె ప్రశాంత్ గల్ఫ్ దేశం నుంచి తిరిగి వచ్చాడు. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన సంధ్య.. అతడిని వదిలించుకోవాలని పథకం రచించింది. ఇందులో భాగంగా స్థానికుడైన సాయి అలియాస్ బంటి అనే వ్యక్తితో కలిసి స్కెచ్ వేసింది. ప్రశాంత్‌తో బంటి కలిసి మద్యం సేవించిన తర్వాత.. ప్లాన్ ప్రకారం మేడపై నుంచి కిందకు తోసేశారు.

 

తీవ్ర గాయాలైన ప్రశాంత్‌ను ఏమీ తెలియనట్లు మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సంధ్య తన క్రూరత్వాన్ని వీడలేదు. ఎవరూ లేని సమయం చూసి, టాయిలెట్ క్లీనర్ హార్పిక్ లిక్విడ్‌ను సిరంజి ద్వారా భర్త ప్రశాంత్ నరాల్లోకి ఎక్కించి ప్రాణాలు తీసింది.

 

మొదట ప్రమాదంగా భావించిన ఈ కేసులో పోలీసుల విచారణతో అసలు నిజాలు బయటపడ్డాయి. నిందితుడు వెంకట సాయి అలియాస్ బంటి పోలీసుల ఎదుట నోరు విప్పడంతో ఈ ఘోర హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. భార్య సంధ్యతో పాటు ఈ హత్యకు సహకరించిన ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని రిమాండ్‌కు తరలించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram