సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి:
కామారెడ్డి : జనగణన–2027ను ఎలాంటి ప పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందికి సూచించారు. జనగణన అత్యంత కీలకమైన జాతీయ కార్యక్రమమని, ప్రతి విషయాన్ని ఖచ్చితత్వంతో పొందుపరచాలని ఆదేశించారు.
కామారెడ్డి జిల్లాలో జనగణన–2027 రెండో దశకు సంబంధించి సెన్సెస్ ఛార్జ్ క్లర్క్లు, సాంకేతిక సహాయకులకు శుక్రవారం రెండు రోజుల శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్న ఈ శిక్షణలో జిల్లాలోని 25 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలకు చెందిన సిబ్బంది పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణను సద్వినియోగం చేసుకుని జనాభా గణన విధివిధానాలపై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించేటప్పుడు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
శిక్షణలో భాగంగా జనాభా గణనకు సంబంధించిన 40 రకాల ప్రశ్నలు, సమాచార సేకరణ విధానం, స్వీయ గణన ప్రక్రియ, సి.ఎం.ఎం.ఎస్. పోర్టల్లో చేపట్టాల్సిన సాంకేతిక ప్రక్రియలపై మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నిబంధనలను వివరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి రఘునందన్, జిల్లా గణాంకాల అధికారి కార్యాలయ మాస్టర్ ట్రైనర్లు భుక్య రవికుమార్, ఏ.ఆర్. యుగంధర్ బాబు, సెన్సెస్ ఛార్జ్ క్లర్క్లు, సాంకేతిక సహాయకులు తదితరులు పాల్గొన్నారు.









